యూరప్ కు 'ఆంజనేయులు'
రవితేజ, నయనతార జంటగా పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్ బాబు సమర్పణలో నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఆంజనేయులు'. పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకుడు. ఈ చిత్రం హైద్రాబాద్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకొంటోంది. ఈనెలలోనే చిత్రయూనిట్ యూరప్ వెళ్తున్నట్టు నిర్మాత గణేష్ బాబు తెలిపారు.
ఏప్రిల్ 22 నుంచి ఏకథాటిగా హైద్రాబాద్ లో షెడ్యూల్ జరుగుతోందనీ, 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కార్పొరేట్ ఆఫీస్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను తీశామనీ ఆయన చెప్పారు. ఈనెల 16వరకూ వివిధ లొకేషన్లలో చిత్రంలోని ప్రధాన తారాగణంతో షెడ్యూల్ చేసి యూనిట్ యూరప్ షిఫ్ట్ అవుతుందన్నారు. 18 నుంచి 26 వరకూ అమ్ స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రేలియాలో రవితేజ, నయనతారపై రెండు పాటల్ని చిత్రీకరించి మళ్లీ మే27 నుంచి జూలై 20 వరకూ హైద్రాబాద్ లో కంటిన్యూస్ గా చేసే షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుందన్నారు. ఆగస్ట్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రవితేజ ఎంతో ఎనర్జిటిక్ పెర్ ఫారమెన్స్ చూపుతున్నారనీ, నిర్మాతగా తన తొలి చిత్రం రవితేజలాంటి మంచి హీరోతో చేయడం ఆనందంగా ఉందనీ అన్నారు. పరశురామ్ ఎంతో అనుభవమున్న దర్శకుడిగా పక్కా ప్లానింగ్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. రవితేజ కెరీర్ లోనే 'ఆంజనేయుడు' బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూ సూద్, ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజారవీంద్ర, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, సన, జీవా, మాస్టర్ భరత్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. రవికిరణ్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు సైతం పరశురామ్ అందిస్తుండగా, కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎస్.థమస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|