రెహ్మాన్ కు 'సుర్ షెహన్ షా'
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కు హైద్రాబాద్ లోని మారియట్ హోటల్ లో ప్రముఖ గాయని పి.సుశీల చేతుల మీదుగా ఘనసత్కారం జరిగింది. ఎ.ఆర్.రెహమాన్ తల్లి కరీమా బేగం సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. రెహమాన్ కు స్వర్ణ కిరీటంతోనూ, కరీమాకు స్వర్ణ కంకణాలతోనూ పి.సుశీల సత్కరించారు. ఇదే వేదిక నుంచి రెహమాన్ కు 'సుర్ షెహన్ షా' బిరుదును జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రదానం చేశారు. తిరుమల గ్రూప్స్ అధినేత అమర్ నాథ్, పి.సుశీల ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెహ్మాన్, పి.సుశీల కుటుంబ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, ఆర్.పి.పట్నాయక్, పాప్ సింగర్ స్మిత, సునీత, మా టీవీ సిఇవో తపస్ తదితరులు పాల్గొన్నారు.
తనకు జరిగిన సన్మానానికి రెహమాన్ కృతజ్ఞతలు తెలుపుకొంటూ, తెలుగు నేలపై తనకు జరిగిన ఈ సత్కారం మరోసారి ఆస్కార్ వచ్చినంత ఆనందాన్ని కలుగజేసిందని అన్నారు. స్వర్ణ కిరీటం అందుకోవడానికి తాను రాలేదనీ, పి.సుశీల వంటి గోల్డ్ మైన్ కోసం తాను వచ్చాననీ, దేశంలోనే అత్యుత్తమ గాయనీమణి అయిన పి.సుశీల చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గ్రేట్ అచీవ్ మెంట్ గా భావిస్తున్నాననీ అన్నారు. తనను ఎంతగానో అభిమానించి, ప్రోత్సహిస్తునన తెలుగు లవర్స్ అందరికీ తన కృతజ్ఞతలని అన్నారు. తన సంగీత ప్రస్థానం తెలుగులోనే ప్రారంభమైందనీ, అందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు. తాను ప్లస్ వన్ చదువుతున్నప్పుడు తన కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొందనీ, అప్పుడు తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఏడాది పాటు తన టీమ్ లో ఉంచుకున్నారనీ, ఆ తర్వాత రెండేళ్ల ఇళయరాజా వద్ద పనిచేశాననీ, అనంతరం ఆరేళ్లు రాజ్-కోటి వద్ద పనిచేశాననీ అన్నారు. ఎన్నో తెలుగు సినిమాలకు కీ బోర్డు ప్లే చేశానని చెప్పారు. హైద్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తనకెంతో నచ్చిందనీ, తెలుగువారంతా చాలా వెల్ కమింగ్ గా ఉంటారని నవ్వుతూ అన్నారు. ఆహూతుల కోరిక మేరకు చివర్లో 'జై హో' అంటూ నినాదం చేశారు. రెహమాన్ గర్వించదగిన భారతీయుడనీ, తాు కోరగానే సన్మానానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలని సుశీల పేర్కొన్నారు. రెహ్మాన్ ఆస్కార్ తో ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ తరఫున ఫస్ట్ తానే విషెస్ తెలిపినట్టు ఆర్.పి.పట్నాయక్ పేర్కొన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగాలనే గుణం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలని సింగర్ సునీత్ అన్నారు. సుశీల మేనకోడలు సింగర్ సంధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Be first to comment on this News / Article!
|