క్రిష్ మల్టీస్టారర్ 'వేదం'
తొలిచిత్రం 'గమ్యం'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) మరో సంచలనానికి తెరతీస్తున్నారు. ఈసారి మల్టీస్టారర్ చిత్రానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. స్టైలిష్ హీరోగా వరుస హిట్లు దక్కించుకుంటున్న అల్లు అర్జున్, నిన్నటి 'నేను మీకు తెలుసా', విడుదలకు సిద్ధమవుతున్న 'ప్రయాణం' చిత్రాల ప్రామిసింగ్ హీరోగా మంచు మనోజ్ కుమార్, 'అరుంధతి' తో టాప్ హీరోయిన్ల రేంజ్ కి చేరిన అనుష్క ఈ మల్టీస్టారర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి 'వేదం' అనే టైటిల్ ఖరారైంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై దేవినేని ప్రసాద్, శోభు యార్గగడ్డ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
చక్కటి కథాబలం కలిగిన ఇతివృత్తంగా 'వేదం' చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు. కథ విన్న వెంటనే బన్నీ, మనోజ్, అనుష్క తమ అంగీకారాన్ని తెలిపినట్టు చెపుతున్నారు. మరికొందరు ఆర్టిస్టులు కూడా కీలక పాత్రలకు ఎంపిక చేయనున్నారు. తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు స్టార్ హీరోలు ఇష్టపడని తరుణంలో 'వేదం' చిత్రంతో సరికొత్త ట్రెండ్ మొదలవుతుందని ఆశించవచ్చు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. జూన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
Be first to comment on this News / Article!
|