తొలిచిత్రం 'వెన్నెల'తో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా నిరూపించుకున్న దేవ్ కట్టా కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో ఓ కొత్త చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించనున్నారు. ఈ చిత్రంలో హీరో గా శర్వానంద్ ('గమ్యం' ఫేమ్) ఎంపికయ్యారు. ఆయనకు జోడిగా ఢిల్లీ అమ్మాయి రూబీ తెలుగుతెరకు తొలిసారి పరిచయమవుతోంది. డైలాంగ్ కింగ్ సాయికుమార్ మరో కీలక పాత్రను పోషించనుండగా, వినోదప్రధానంగా సాగే మరో పాత్రలో 'వెన్నెల' కిషోర్ నటించనున్నారు. వి.ఆర్.సి. మీడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రవి వల్లభనేని ('వెన్నెల' ఫేమ్) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఒక పొలిటికల్ కుటుంబం చుట్టూ క్యారెక్టర్ల ప్రధానంగా సాగే చిత్రమిదని దేవ్ కట్టా చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ 'ఫూంక్' చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్న సవితా సింగ్ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అదించనున్నారు. మహేష్ శంకర్ సంగీత దర్శకత్వం వహించున్నారు. జూన్ 10న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి దీపావళి కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.