పార్వతి పునరాగమనం
ఒక సంచలన విజయం తర్వాత అడ్రస్ కనిపించకపోవడం ఆర్టిస్టుల విషయంలో చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. ఎన్ఆర్ఐ ముద్దుగుమ్మ, పొడుగు కాళ్ల సుందరి పార్వతి మెల్డన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 'జల్సా' వంటి సూపర్ హిట్ తర్వాత ఏడాదిగా పార్వతి పేరు వార్తల్లోనే ఉన్నా...అలిగి ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆర్నెల్ల క్రితం యుఎస్ వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆమె పునరాగమనం చేస్తోంది.
'వెన్నెల' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన పార్వతి మెల్టన్ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు చేరువైంది. 'గేమ్', 'అల్లరే అల్లరి', 'మధుమాసం' వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ పార్వతికి గత ఏడాది 'జల్సా' చిత్రం ఊహించని పేరు తెచ్చిపెట్టింది. అందులో ప్రధాన హీరోయిన్ ఇలియానా అయినప్పటికీ పార్వతి మెల్టన్ తన గ్లామర్ తో యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో తొలిసారిగా స్టార్ హీరో మహేష్ బాబుతో 'వరుడు' చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం పార్వతిని వరించింది. ఇక పార్వతికి తిరుగులేదని అంతా అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి జాప్యం జరగడంతో పాటు కారణాంతరాల వల్ల పార్వతికి ఉద్వాసన చెప్పారు. ఆమె ప్లేస్ లో అనుష్క వచ్చిచేరింది. మహేష్ సినిమా కోసం ఏడాది సమయం వృథా చేసుకోవడంతో తీవ్రంగా కలత చెందిన పార్వతి ఆర్నెల్ల క్రితం తీవ్రంగా అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె జాడ లేదు. ఎట్టకేలకు తన అభిమానులకు స్వాంతన కలిగిస్తూ ఆమె తిరిగి వచ్చారు. ఇది హాలిడే ట్రిప్ కాదనీ, తన తల్లికి అనారోగ్యం కారణంగానే అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందనీ పార్వతి వివరణ ఇచ్చింది. 'అమ్మ ఆరోగ్యం విషమంగా ఉండటంతో దగ్గరుండి ఆమెకు సేవలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె బాగా కోలుకుంది' అని తెలిపారు. ప్రస్తుతం పలు ఎగ్జయింటింగ్ ఆఫర్లు తన ముందున్నాయనీ, త్వరలోనే వాటిని ఫైనలైజ్ చేయబోతున్నాననీ ధీమా వ్యక్తం చేసింది. పార్వతి తదుపరి ప్రాజెక్ట్ ఏమిటనేది ప్రస్తుతం అందిరిలోనూ ఉత్సుకత రేకెత్తిస్తోంది.
Be first to comment on this News / Article!
|