'ఏడుకొండలవాడా..' లోగో
సురేంద్ర, హర్షిక, నవనీత్ కౌర్, సునీల్, శివారెడ్డి ప్రధాన పాత్రల్లో శ్రీ కాశినాయన కళామందిర్ పతాకంపై గుండ్లకుంట శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రానికి 'ఏడు కొండలవాడా వెంకటరమణ' (అందరూ బాగుండాలి) అనే టైటిల్ ను ఖరారు చేశారు. సూర్య ఇంజమూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకనిర్మాతలతో పాటు ప్రాణ్యం ఎమ్మెల్యే బి.పార్ధసారధి, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, నటుడు శివారెడ్డి, రచయిత సుదర్శన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పార్థసారధి లోగో ఆవిష్కరించారు.
దర్శకుడు సూర్య మాట్లాడుతూ, ఇది సందేశంతో కూడిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రమనీ, సమాజంలోని ప్రస్తుత సమస్యలనూ, వాటి పరిష్కారాన్ని ఇందులో చూపించామనీ చెప్పారు. రచయిత సుదర్శన్ మాట్లాడుతూ, ఆరేళ్లుగా ఈ కథను పలువురికి వినిపించినా ఎవరూ సినిమాగా తీయడానికి ముందుకు రాలేదనీ, ఈ చిత్ర నిర్మాత ఒకసారి తిరుపతిలో కనిపించినప్పుడు మాటల సందర్భంలో ఆయన సినిమా తీయాలనుకున్న విషయాన్ని చెప్పడం, తాను కథ వినిపించడం జరిగిందనీ, ఆయన వెంటనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించి కొంత సొమ్ము అడ్వాన్ ఇచ్చారనీ తెలిపారు. ఈ చిత్రం చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన గత చిత్రాల కంటే వైవిధ్యంగా ఈ చిత్రంలోని మ్యూజిక్ ఉంటుందని ఘంటాడి కృష్ణ పేర్కొన్నారు. మంచి టీమ్ తో పనిచేస్తుండటం, తన మీద అభిమానంతో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నిర్మాత శ్రీరాములు అన్నారు.
Be first to comment on this News / Article!
|