ఎపిలో 'మల్లన్న' టీమ్ దత్తత
సినిమా నిర్మాణం వ్యాపారమే అయినా అందువల్ల వచ్చే లాభాలను సమాజసేవకు వెచ్చించాలనే ఆలోచన ఎవరు చేసినా అది ప్రశంసనీయమే అవుతుంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత నిర్మాత వెంకట్ తాను నిర్మించిన ప్రతి చిత్రం ఆడియో విడుదల సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చి తమ సహృదయత, సమాజం పట్ల తమకున్న బాధ్యత చాటుకుంటున్నారు. తాజాగా హీరో విక్రమ్ కథానాయకుడుగా 'మల్లన్న' (తమిళంలో 'కందస్వామి') చిత్రాన్ని 40 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్న ప్రముఖ నిర్మాత కళైపులి థాను సైతం ఇప్పుడు ఓ 'నోబుల్ కాజ్' తో అందరి మన్ననలు అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రెండు గ్రామాలను దత్తత చేసుకుని కనీక సౌకర్యాల కల్పన ద్వారా వాటిని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఇండియాలో ఆర్థిక అసమానతలు, వాటి పరిష్కారానికి సంబంధించిన కథాంశంతో 'మల్లన్న' చిత్రాన్ని దర్శకుడు సుశీ గణేషన్ తెరకెక్కించారు. కేవలం సందేశాలు ఇవ్వడానికో, పరిష్కారం చెప్పడానికో పరిమితం కాకుండా ఇందుకు తామే ఒక ఉదాహరణ కావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేయడంతో 'గ్రామాల దత్తత' ఆలోచన కార్యరూపంలోకి రాబోతోంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సోమవారం సాయంత్రం జరిగిన 'మల్లన్న' ట్రైలర్స్ విడుదల కార్యక్రమంలో భాగంగా సుశీ గణేషన్ ఈ వివరాలను తెలియజేస్తూ, తమిళనాడులో ఇప్పటికే 30 గ్రామాల దత్తత ప్రక్రియకు జరుగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు గ్రామాలను దత్తత చేసుకోనున్నామనీ చెప్పారు. హీరో విక్రమ్ మరింత వివరణ ఇస్తూ, గ్రామాల దత్తత అనేది చిత్తశుద్ధితో చేపడుతున్న కార్యక్రమమనీ, 'మల్లన్న' సినిమా కోసం చేస్తున్న పబ్లిసిటీ జిమ్మిక్ ఎంతమాత్రం కాదనీ అన్నారు. ఇలాంటి ఉదాత్త కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనను కార్యరూపంలోకి తెస్తున్న నిర్మాత థాను, దర్శకుడు సుశీ గణేషన్ అభినందనీయులనీ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|