పాప కోసం ప్రకాష్ రాజ్
ఆకాశమంత ప్రేమను గుండెనిండా నింపుకున్న ఓ తండ్రి ఆమె పెరిగి పెద్దదవుతూ క్రమంగా తనకు దూరమవుతుంటే పడే తపన ఎలా ఉంటుందనేది ఇటీవల విడుదలైన 'ఆకాశమంత' చిత్రంలో చూపించారు. ప్రకాష్ రాజ్ తండ్రిగా, త్రిష కూతురుగా నటించారు. ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ చిత్రం తమిళ వెర్షన్ 'అభియుమ్ నానుమ్' చిత్రాన్ని నిర్మించారు కూడా. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో అంతలా జీవించడానికి కారణం కూడా లేకపోలేదు. ఇది ఆయన రియల్ లైఫ్ స్టోరీ నుంచి అల్లుకున్న కథే. ఆ మాట అటుంచితే రియల్ లైఫ్ లోనూ ప్రకాష్ రాజ్ తన 'పాప కోసం' న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ లైఫ్ ఇటీవల కాలంలో చిక్కుల్లో పడింది. కొద్దికాలం క్రితం లలితా కుమారిని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. నటుడు శ్రీహరి భార్య అయిన శాంతి సోదరే ఈ లలితా కుమారి. ప్రకాష్ రాజ్ వైవాహిక జీవితంలో ఇటీవల విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం ఆయన ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే విడాకులు ఇవ్వడానికి లలితా కుమారి ససేమిరా అంటున్నారు. తన భర్తతో కలిసి ఉండాలనే కోరికను ఆమె బలంగా వ్యక్తం చేస్తోంది. ఇందుకు ప్రకాష్ రాజ్ సుముఖంగా లేరు.
చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో సోమవారంనాడు ఈ వ్యవహారం విచారణకు వచ్చింది. తన కుమార్తెను కలుసుకోకుండా లలిత అడ్డుకుంటోందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ పాపను కలుసుకునేందుకు మార్గం సుగమం చేయాలని కోర్టును అభ్యర్థించారు. తన కుమార్తెను తండ్రి దగ్గరకు పంపడానికి తనకు అభ్యంతరం లేదనీ, అయితే పాప వెంట తాను కూడా ఉండాలనీ లలిత తన వాదనను వినిపించింది. ఇందుకు ప్రకాష్ రాజు అభ్యంతరం చెబుతున్నారు. ఈ ఇద్దరి అభిప్రాయాలనూ మేజిస్ట్రేట్ విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా లలితా కుమారిని కోర్టు ఆదేశించింది.
Be first to comment on this News / Article!
|