ఏటికేడాది షూటింగ్స్ లో పాల్గొనే స్టార్ లు సమ్మర్ సీజన్ లో ఒకింత విశ్రాంతిని కోరుకుంటారు. తమకు నచ్చిన టూరింగ్ స్పాట్ లను ఎంచుకుని విదేశాల్లో కొద్దిపాటి విశ్రాంతి తీసుకోవడం రివాజు. కొంతమంది హీరోలు ఫారిన్ లొకేషన్లలో షూటింగ్ లు ఎరేంజ్ చేసుకోవడం ద్వారా ఇటు వర్కింగ్ షెడ్యూల్ కు అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తగినంత విశ్రాంతిని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. యంగ్ హీరో రామ్ చరణ్ సైతం కొద్దిపాటి రెస్ట్ కోసం అమెరికా బయలుదేరి వెళ్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'మగధీర' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకొంటోంది. రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ తోనూ, తన తండ్రి చిరంజీవి 'ప్రజారాజ్యం పార్టీ' తరఫున ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొని నిన్నటివరకూ బిజీగా ఉన్న రామ్ చరణ్ కు ఇప్పుడు తగినంత తీరిక దొరికింది. రెండు వారాల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున వచ్చే వారం రామ్ చరణ్ అమెరికా బయలుదేరుతున్నారు. తిరిగి ఆయన జూన్ 15వ తేదీ నాటికి హైదరాబాద్ చేరుకుంటారు. 'మగధీర' చిత్రాన్ని జూన్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం తర్వాత 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించనున్న చిత్రానికి రామ్ చరణ్ కమిట్ అయ్యారు.