'బిల్లా' ట్రిపుల్ ప్లాటినం
ప్రభాస్, అనుష్క, నమిత ప్రధాన తారాగణంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నరేంద్ర, ప్రబోధ్ నిర్మించిన చిత్రం 'బిల్లా'. కృష్ణంరాజు మరో కీలక పాత్ర పోషించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం ఆడియోకు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ లభించింది. ఈ వేడుకను హైద్రాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రభాస్, అనుష్క, కృష్ణంరాజు తదితరులతో పాటు ముఖ్య అతిథులుగా వి.వి.వినాయక్, నిర్మాత దొరస్వామిరాజు విచ్చేశారు. వినాయక్ చేతుల మీదుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు షీల్డుల ప్రదానం జరిగింది.
కృష్ణంరాజు మాట్లాడుతూ, ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తూ మంచి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. మూడు వారాలకు దాదాపు 16.5 కోట్ల షేర్ వసూలు కావడం మామాలు విషయం కాదనీ, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు తన కృతజ్ఞతలనీ అన్నారు. ఇంతవరకూ ప్రబాస్ చేసిన చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించాలని తాము చేసిన ప్రయత్నం ఈ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. యూనిట్ అంతా తమ సొంత చిత్రంగా భావించిన పనిచేశారనీ, వారందరికీ ఈ విజయం దక్కుతుందని అన్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ, బిల్లాను ఇంత పెద్ద సెక్సెస్ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటామని చెప్పారు. కృష్ణంరాజు బాగా నటించారనీ, ప్రభాస్ కోసం తమ పిల్లలు ఈ సినిమాను పదిసార్లు చూశారనీ చెప్పారు. మెహర్ రమేష్ సినిమాను బాగా తీర్చిదిద్దారనీ, అనుష్క తన సొంత సినిమాలా భావించి పనిచేసిందనీ ప్రశంసించారు. వినాయక్ మాట్లాడుతూ, ప్రభాస్ ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించారని పేర్కొనగా, ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' ను తాను పంపిణీ చేశాననీ, 'బిల్లా' చిత్రాన్ని మెహర్ రమేష్ చాలా స్టయిలిష్ గా తీర్దిదిద్దారనీ దొరస్వామిరాజు అన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ, కేవలం నాలుగున్నర మాసాల వ్యవధిలో ఇంత పెద్ద చిత్రం తీయడం సామాన్యమైన విషయం కాదనీ, ఇందుకు కారకులైన దర్శకుడికి, యూనిట్ సభ్యులందరికీ తన కృతజ్ఞతలనీ అన్నారు. ఈ చిత్రం సక్సెక్ లో తొలి క్రెడిట్ ప్రభాస్ కు దక్కుతుందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. గోపీకృష్ణ బ్యానర్ లో తన పెదనాన్నతో కలిసి నటించాలనే ప్రభాస్ డ్రీమ్ తన దర్శకత్వంలో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. నటులు సునీల్, సుబ్బరాజు, లహరి మ్యూజిక్ ప్రతినిధి శ్రీనివాస్, నిర్మాతలు నరేంద్ర, ప్రబోధ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|