'గోపి గోపిక గోదావరి' సాంగ్స్
వేణు, కమలిని ముఖర్జీ జంటగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'గోపి గోపిక గోదావరి'. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో వేడుక రాజమండ్రి గోదావవరి తీరంలో వినూత్న రీతిలో జరిగింది. పుష్కరాల రేపులోని లాంచీలో ప్రత్యేకంగా వేసిన మొబైల్ హాస్పిటల్ సెట్ లో ఆడియోను విడుదల చేశారు. ఆడియో క్యాసెట్ ను జెమినీ ఫిలిం సర్క్యూట్స్ అధినేత రవిశంకర్ ప్రసాద్ ఆవిష్కరించి తొలి ప్రతిని వంశీకి అందజేశారు. ఆడియో సీడీని వేణు-కమలిని ముఖర్జీ ఆవిష్కరించి చిత్ర సంగీత దర్శకుడు చక్రికి అందజేశారు. 93.5 ఎస్.ఎఫ్.ఎం. రేడియో వారు నిర్వహించిన గోపి-గోపిక జంటల కాంటెస్ట్ లో ఎంపికైన ఐదు జంటలకు వేణు-కమలిని చేతుల మీదుగా ఆడియో సీడీలను అందజేశారు.
హీరో వేణు మాట్లాడుతూ, ఆడియోతో పాటు, సినిమాను కూడా ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తే శతదినోత్సవాన్ని కూడా ఇలాగే అభిమానుల సమక్షంలో జరుపుతామని అన్నారు. గోదావరి ప్రాంతంతో తనకెంతో అనుబంధం ఏర్పడిందని కమలిని పేర్కొన్నారు. వంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమనీ, ఈ చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంలా ఆయన మలిచారనీ చెప్పారు. చక్రి మాట్లాడుతూ, వంశీతో గతంలో తాను చేసిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమా కంటే ఈ చిత్రం మరింత పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటలను ఆయన పాడి వినిపించారు. నిర్మాత వల్లూరి పల్లి రమేష్ మాట్లాడుతూ, వంశీ మొదటి సినిమా 'మంచుపల్లకి'తోనే తాను ప్రొడక్షన్ మేనేజర్ గా సినీ కెరీర్ ప్రారంభించారనీ, నిర్మాతగా తన మొదటి చిత్రం 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' కూడా వంశీ దర్శకత్వంలోనే నిర్మించి విజయం సాధించానని అన్నారు. మళ్లీ ఆలాంటి విజయం సాధించాలనే పట్టుదలతో ఈ చిత్రాన్ని తీశామని చెప్పారు. ఈ నెలాఖరులోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, వంశీ, 93.5 ఎస్.ఎఫ్.ఎం. బృందం, ముకుంద, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|