లావుపాటి హీరో ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడే ఇతివృత్తంతో సాయికుమార్ అడవి తీసిన 'వినాయకుడు' చిత్రం ప్రేక్షకాభిమానులను అలరించి బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంది. ఇందులో కృష్ణుడు, సానియా జంటగా నటించారు. కొద్దికాలంగా ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచనకు సాయికుమార్ అడవి ఇప్పుడు కార్యరూపంలోకి తేనున్నారు. పెళ్లి తర్వాత వినాయకుడు పడే పాట్లను చూపించే ఆ చిత్రానికి 'విలేజిలో వినాయకుడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సీక్వెల్ లో మరోసారి కృష్ణుడు కథానాయకుడిగా నటించనున్నారు. సీక్వెల్ సినిమాలకు హీరోయిన్లు మారిపోతుంటారనే సెంటిమెంట్ తరహాలోనే ఈసారి కూడా కథానాయిక మారుతోంది. నూడిల్స్ సుందరి సోనియాకి బదులుగా తమిళ నటి శరణ్య మోహన్ ను కృష్ణుడుకు జోడిగా ఈసారి ఎంపిక చేశారు.
శరణ్య మోహన్ ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాల్లో నటించి మంచి డిమాండ్ లో ఉన్నారు. హీరో సిద్దార్ధ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా శరణ్యను తెలుగు తెరకు పరిచయం చేయాలని అనుకున్నప్పటికీ సాయికిరణ్ ముందుగానే తన చిత్రానికి ఆమెను ఎంపిక చేశారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నట్టు....జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన ఓ చిత్రంలో కృష్ణుడు-సోనియా జంటగా నటిస్తున్నారు.