పోసాని 'అర్ధనారీశ్వరుడు'
పోసానిలోని ఆవేశం ఆయనలోని ఆలోచనాపరుడ్ని తరచు డామినేట్ చేస్తుంటుంది. దీంతో ఆయనను తిక్కలోడని అనుకునే వాళ్లకూ కొదవలేదు. వందకు పైగా చిత్రాలకు కథ, రచన చేసిన పోసాని ఇటీవల కాలంలో దర్శకుడిగా, నటుడిగా, రచయితగా అన్నీ తానే అయి ఏదోరకంగా తన సినిమాలతో సంచలనాలు సృష్టించేందుకు వెనుదీయడం లేదు. 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రంలో నీటు కంటే నాటే ఎక్కువ ఉండటం, పొలిటికల్ సెటైర్లు ఆ చిత్రానికి విజయపథంలోకి నడిపించాయి. అయితే ఆ తర్వాత తీసిన 'ఆపద మొక్కులవాడు' బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూస్తే, 'మెంటల్ కృష్ణ' చిత్రంలో శాడిస్టు భర్తగా పోసాని కొంత అలజడి సృష్టించారు. 'రాజావారి చేపలచెరువు' అనే రాజకీయ వ్యంగాస్త్రాన్ని ఈ శుక్రవారమే ప్రేక్షకులపై సంధిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పోసాని మరో సినిమాకి కూడా గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు. దీనికి 'అర్ధనారీశ్వరుడు' అనే టైటిల్ ను కూడా ఆయన రిజిస్టర్ చేయించారు.
ఆసక్తికరంగా పోసాని ఈ చిత్రంలో కథానాయకుడుగా శ్రీకాంత్ ను ఎంపిక చేశారు. శ్రీకాంత్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'మహాత్మ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది శ్రీకాంత్ 100వ చిత్రం కూడా కావడం విశేషం. పోసాని కాంబినేషన్ లో శ్రీకాంత్ ఇప్పటికే 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రంలో నటించగా, త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేస్తానని అప్పట్లో శ్రీకాంత్ ప్రకటించారు. ఆ సీక్వెల్ మాటెలా ఉన్నా పోసాని 'అర్ధనారీశ్వరుడు'కు శ్రీకాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. 'మహాత్మ' తర్వాత ఈ కొత్త చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|