కృష్ణ బర్త్ డేకి 'నేరము-శిక్ష'
సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఉత్సాహం ఈసారి రెట్టింపు కాబోతోంది. ఈనెల 31న కృష్ణ 66వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఇందుకు రెండు రోజులకు ముందే 29న ఆయన నటించిన 'నేరము-శిక్ష' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కృష్ణ, విజయనిర్మల, జయసుధ నాయకానాయికలుగా విజయకృష్ణా మూవీస్ పతాకంపై శ్రీమతి విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకురాలిగా విజయనిర్మలకు ఇది 44వ చిత్రం కాగా, కృష్ణ కాంబినేషన్ లో ఆమె నటిస్తున్న 50 చిత్రం కూడా కావడం విశేషం. గతంలో కృష్ణ కథానాయకుడిగా విజయవంతైన 'నేరము-శిక్ష' టైటిల్ నే ఈ చిత్రానికి ఎంపిక చేయడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన 'వల' నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామనీ, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, సస్పెన్స్ వంటి అంశాలనీ ఇందులో ఉంటాయనీ విజయనిర్మల తెలిపారు. కృష్ణగారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ చిత్రం రూపొందిందనీ, ఇందులో లాయర్ భార్గవ్ గా ఆయన నటన ప్రేక్షకులను అలరిస్తుందనీ చెప్పారు. ఉరి శిక్షలు న్యాయ సమ్మతమేనా అనే ఆంశాన్ని ఈ చిత్రంలో డీల్ చేశామని అన్నారు. కృష్ణగారి పుట్టిన రోజు కానుకగా ఈనెల 29న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అకుల్, ఆకర్ష యువజంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ధీరజ్, రూప, విజయ్ చందర్, బాలయ్య, గిరిబాబు, నిశ్చల్, రమాప్రభ, గీతాంజలి, శ్రీలక్ష్మి, బాలాజీ, సునీల్, జయప్రకాష్ రెడ్డి, ఏవియస్, రావికొండలరావు, రాధాకుమారి, నూతన్ ప్రసాద్ నటించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|