మనోజ్ డైరీ హౌస్ ఫుల్
హీరోగా ఇంతవరకూ సరైన సక్సెస్ సాధించనప్పటికీ 'నేను మీకు తెలుసా' చిత్రంతో విలక్షణ పాత్రలకు శ్రీకారం చుట్టిన మంచు మనోజ్ ఇప్పుడు తన కెరీర్ ను పక్కా ప్లానింగ్ తో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలను అంగీకరించడం ద్వారా నటనను మరింత సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో మరో ఏడాది వరకూ ఆయన డైరీ ఫుల్ అయింది.
మనోజ్ కథానాయకుడుగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ప్రయాణం' చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఆయన వరుసగా అరడజను చిత్రాలకు కమిట్ అయ్యారు. 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాల రచయిత వీరుపోట్ల తొలిసారిగా దర్శకుడిగా మారుతూ మనోజ్ హీరోగా 'అజయ్ గాడి విజయ గాథ' అనే రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అజయ్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం జూన్ తొలివారంలో సెట్స్ పైకి రానుంది. జూన్ మధ్యలో క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో 'వేదం' చిత్రం ప్రారంభం కాబోతోంది. మనోజ్ తో పాటు అల్లు అర్జున్, అనుష్క ఇందులో నటించనున్నారు. దీని తర్వాత సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మించనున్న చిత్రం ప్రారంభమవుతుంది. దీనికి దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు దర్శకత్వం వహించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రానికి, కృష్ణవంశీ శిష్యుడు రాజా తొలిసారి దర్శకత్వం వహించనున్న 'ఊ అంటావా...ఉలిక్కిపడతావా' చిత్రం, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో చిత్రానికి కూడా మనోజ్ కమిట్ అయ్యారు. ఈ చిత్రాలతో మనోజ్ 2010 వరకూ తీరికలేనంత బిజీగా ఉండబోతున్నారు. గ్రేట్ గోయింగ్ మనోజ్..
Be first to comment on this News / Article!
|