'పులి' సెట్స్ కు పవన్
పుణేలో రేణూదేశాయ్ తో కలిసి కొద్ది పాటి విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్ తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు. ఆయన రాకతో మళ్లీ 'కొమురం పులి' తాజా షెడ్యూల్ మొదలైంది. 'జల్సా' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత పవన్ నటిస్తున్న 'కొమురం పులి' చిత్రం ఇంతవరకూ 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ తో 'ఖుషీ' వంటి మంచి హిట్ ను అందించిన ఎస్.జె.సూర్య ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగనమల రమేష్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇందులో పోషిస్తున్నారు. లండన్ కు చెందిన మేడల్ నికిష ఈ చిత్రం ద్వారా హీరోయన్ గా పరిచయమవుతోంది. జూలై నెలాఖరు వరకూ జరిగే తాజా షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్టులో సినిమా రిలీజ్ కు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ బాజ్ పాయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు గణేష్ బాబు నిర్మించనున్న చిత్రానికి పవన్ కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|