తారల గెలుపు-ఓటమి
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున ఈసారి పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్లామర్ మంత్ర అంతంత మాత్రంగానే పని చేసిందని ఫలితాలు రుజువు చేశాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు విజయశాంతి, రోజా, మురళీ మోహన్, కృష్ణంరాజు, అల్లు అరవింద్, బాబూ మోహన్, పోసాని కృష్ణ మురళి, చెంగల వెంగళరావు, నూకారపు సూర్యప్రకాశరావు వంటి పలువురు సినీ రంగప్రముఖులు ఈసారి బరిలో దిగినప్పటికీ ఎక్కువ మంది ఓటమి చవిచూశారు.
తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న చిరంజీవి ఊహించని విధంగా పాలకొల్లు నుంచి ఓటమి పాలయ్యారు. మెదక్ ఎంపి స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి గెలుపొందారు. సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున తొలిసారి పోటీ చేసిన సహజనటి జయసుధ 3 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. గుడివాడ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసిన కొడాలి వెంకటేశ్వర రావు విజేతగా నిలిచారు. తెలుగుదేశం తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీపడిన రోజా, అదే పార్టీ తరఫున రాజమండ్రి ఎంపిగా పోటీచేసిన మురళీమోహన్, పిఆర్ పి తరఫున ఎంపి స్థానానికి పోటీ చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన బాబూమోహన్, చిలుకూరి పేట అసెంబ్లీ పిఆర్ పి అభ్యర్థి పోసాని కృష్ణమురళి పరాజయం పాలయ్యారు. అలాగే తెలుగుదేశం తరఫున అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన నూకారపు సూర్యప్రకాశరావు, పిఆర్ పి తరఫున ఎంపిగా బరిలో దిగిన అల్లు అరవింద్, పాయకరావు పేట తెలుగుదేశం ఎమ్మెల్యేగా బరిలో ఉన్న చెంగల వెంకట్రావు ఓటమి చవిచూశారు.
Be first to comment on this News / Article!
|