'సూరి' పాత్రలో సూర్య
సంచనాలకు మరోపేరు రామ్ గోపాల్ వర్మ. రియలస్టిక్ థీమ్ లతో ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూ వార్తల్లో ఉండటం ఆయన స్పెషాలిటీ. ఇటీవల కాలంలో పలు' చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాలు చవిచూసినా ఆయనలోని పట్టుదల చెక్కుచెదరలేదు. మీడియా మంచిచెడ్డలను ఫోకస్ చేస్తూ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'రణ్' చిత్రాన్ని ఆయన విడుదలకు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో జాతీయ గీతాన్ని రీమిక్స్ చేస్తూ 'జన గణ మన రణ్ హై' అంటూ తీసిన గీతం ప్రమోషన్ స్థాయిలోనే వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన ఫ్యాక్షన్ లీడర్ స్థాయి నుంచి రాజకీయ నాయకుడైన పరిటాల రవి నిజ జీవిత చరిత్రను 'రక్త చరిత్ర' పేరుతో స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారు. సుమారు 5 గంటల నిడివితో రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరిటాల రవి క్యారెక్టర్ కు వివేక్ ఒబెరాయ్ ను ఇప్పటికే ఎంపిక చేసిన వర్మ, ఇప్పుడు ఆ పాత్రతో సమానమైన మద్దెల చెరువు సూరి పాత్రకు తమిళ స్టార్ హీరో సూర్యను ఎంపిక చేశారు.
పరిటాల రవికి ప్రత్యర్థిగా సూరి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రకు సూర్యను ఎంపికచేశారు. 'గజనీ', 'అయన్' (వీడొక్కడే) చిత్రాలతో తమిళనాట తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న సూర్యకు బాలీవుడ్ లో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. గతంలో సూర్య కథానాయకుడుగా తమిళంలో ఆర్ జివి పతాకంపై ఓ సినిమా తీసేందుకు వర్మ ప్లాన్ చేసినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. పరిటాల రవి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తాను సేకరించారనీ, ఎంతో రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నామనీ వర్మ తెలిపారు. 'రక్త చరిత్ర' తొలి భాగాన్ని జూన్ లో ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'రక్తచరిత్ర-2' వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ కు వస్తుంది.
Be first to comment on this News / Article!
|