'పిస్తా'..'కరెంట్' వాయిదా!
ఈ వారం ప్రధానంగా రెండు చిత్రాల మధ్య పోటీ ఉండవచ్చని అంతా అనుకుంటున్న తరుణంలో విశాల్ కథానాయకుడిగా నటించిన 'పిస్తా', సుశాంత్ హీరోగా నటించిన 'కరెంట్' చిత్రాలు వారం రోజుల పాటు వాయిదా పడినట్టు తెలిసింది. ఆ ప్రకారం ఈనెల 22న విడుదల కావాల్సిన 'పిస్తా', 21న విడుదలకు సిద్ధమవుతుందని ప్రచారం జరిగిన 'కరెంట్' చిత్రాలు ఈనెల 29వ తేదీకి వాయిదా పడినట్టు సమాచారం. ఐపిఎల్ మ్యాచ్ ల కారణంగానే ఈ రెండు చిత్రాలు విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
విశాల్, శ్రియ జంటగా జి.కె.ఫిలింస్ పతాకంపై విక్రమ్ కృష్ణ దర్శకత్వంలో 'పిస్తా' చిత్రం రూపొందింది. సభా అయ్యప్ప దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో 'తోరణై' పేరుతో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ లో 200 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇక..'కాళిదాసు' చిత్రం తర్వాత నాగార్జున మేనల్లుడు సుశాంత్ కథానాయకుడుగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ప్రేమకథా చిత్రం 'కరెంట్'. సుశాంత్ కు జోడిగా స్నేహ ఉల్లాల్ నటించింది. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. గతవారంలోనే ఈ చిత్రం ట్రయిలర్స్, లోగో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా విడుదలైంది.
Be first to comment on this News / Article!
|