చిన్న నిర్మాతలకు 'చే'యూత
చిత్ర పరిశ్రమలోని ఎగ్జిబిషన్ రంగంలో దళారీ దళారీ వ్యవస్థ వెళ్లూనుకోవడంతో చిన్న నిర్మాతలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, వారికి వై.ఎస్. ప్రభుత్వం 'చే'యూత నివ్వాలని చిన్న నిర్మాతల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైద్రాబాద్ లో మంగళవారంనాడు చిన్న నిర్మాతల సమాఖ్య సమావేశమైంది. సమాఖ్య కన్వీనర్ చదలవాడ శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్, కార్యదర్శి నట్టికుమార్, సభ్యులు వి.సాగర్, సంగిశెట్టి దశరథ, సత్యారెడ్డి, జి.వి.హెచ్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్ర పరిశ్రమకు అభివృద్ధికి ఎంతో పాటుపడిన వై.ఎస్. తిరిగి విజయవంతంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడం పట్ల సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాతల పాలిట శాపంగా మారిన శ్లాబ్ విధానాన్ని వై.ఎస్.ఎత్తివేయడం ద్వారా వై.ఎస్. పరిశ్రమకు మేలుచేశారనీ, చిన్న నిర్మాతల సమస్యలను కూడా ఆయన అర్ధం చేసుకున్నారని ప్రశసించారు. మిగిలిన తమ సమస్యలను కూడా ఆయన పరిష్కరిస్తారనే ఆశాభావంతో ఉన్నామనీ, త్వరలోనే ఇందుకు సంబంధించి ఓ వినతిపత్రాన్ని వై.ఎస్.కు అందజేస్తామని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కష్టపడి తాము సినిమాలు తీస్తుంటే కొందరు థియేటర్లు లీజుకు తీసుకుని గుత్తాధిపత్యం వహిస్తున్నారనీ, పర్సంటేజీ విధానంలో కాకుండా రెంటల్స్ విధానంలో వారు థియేటర్లు నడుపుతున్నారనీ అన్నారు. ఇందువల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుత్తాధిపత్యం పోయేందుకు తాము మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వై.ఎస్.హయాంలో చిన్న నిర్మాతలకు ప్రయోజనం చేకూరుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు నట్టికుమార్ పేర్కొన్నారు. గతంలో నిర్మాతలు సినిమాలు తీస్తే మినిమం గ్యారింటీ ఉండేదనీ, ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితులు నెలకొన్నాయనీ, ఈ పరిస్థితి నుంచి నిర్మాతలను రక్షించాలని వి.సాగర్ పేర్కొన్నారు. పరిశ్రమకు మేలు తలపెట్టిన వై.ఎస్. చిన్ననిర్మాతల అపరిష్కృత సమస్యలను కూడా పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|