ఆంగ్లంలో పూరీ తనయుడు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రధాన పాత్రధారిగా 'లోటస్ పాండ్' అనే అంతర్జాతీయ చిత్రం రూపొందుతోంది. ఆకాష్ ఇప్పటికే 'చిరుత', 'బుజ్జిగాడు' చిత్రాల్లో చిన్నప్పటి హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఈ బాలనటుడు ఇప్పుడు 'లోటల్ పాండ్'లో పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు. త్రిపదయ ఇన్నోవేషన్స్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి యువ ఛాయాగ్రాహకుడు పి.జి.విందా తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు.
విందా ఇప్పటికే 'గ్రహణం', 'వినాయకుడు', 'అష్టాచమ్మ', 'స్నేహగీతం' వంటి పలు చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంత్రంలో ఈనెల 17న 'లోటస్ పాండ్' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఆ విశేషాలను త్రిపదయ ఇన్నోవేషన్స్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.ఎల్.నితిన్ కుమార్ తెలియజేస్తూ, హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంత నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనీ, ఇక్కడి బోర్డింగ్ స్కూల్ లో చదువుకునే ఇద్దరు విద్యార్థులు, వారి ఆలోచనలు, ఆసక్తులు, అక్కడి లోటస్ పాండ్ చుట్టూ కథ నడుస్తుందనీ చెప్పారు. 14000 అడుగుల ఎత్తులో ఉన్న 'లోటస్ పాండ్'లో ఈ ఇద్దరు పిల్లలు విహరించాలని అనుకుంటారనీ, దానిని వారు ఎలా సాధించారనేది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. కులు ప్రాంతంలో ఇంతవరకూ ఎవరూ చూడని ప్రదేశాలను తెరమీద చూపించబోతున్నామనీ, రెగ్యులర్ షూటింగ్ తో జూన్ లో షూటింగ్ పూర్తి చేస్తామనీ చెప్పారు. ఆంగ్లంతో పాటు కులువి భాషలో తొలుత విడుదల చేసి, మిగతా ప్రాంతీయ భాషల్లోనూ అనువదించి రీలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో మరో బాలనటుడిగా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రోహిత్ నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|