'వెంగమాంబ' లోగో
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని తన కీర్తనలతో ఆరాధించి ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు 'తరిగొండ వెంగమాంబ'. 'అన్నమయ్య' వంటి భక్తిరస ప్రధాన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాత దొరస్వామిరాజు తాజాగా వి.ఎం.సి.ప్రొడక్షన్స్ పతాకంపై 'వెంగమాంబ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రను మీనా పోషిస్తున్నారు. ఉదయ్ భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం తుదిమెరుగుల దశలో ఉంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి లోగోను ఆవిష్కరించారు. మీనా, సాయికిరణ్, కీరవాణి, దొరస్వామిరాజు, ఉదయ్ భాస్కర్, శరత్ కుమార్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, వెంగమామ భక్తురాలు, కవయిత్రి మాత్రమే కాకుండా సంఘ సంస్కర్త కూడాననీ, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు తరహాలో వైధవ్యంపై నాటి సమాజ శాసనాలను ధిక్కరించిన మహిళగా కూడా ఆమెకు పేరుందనీ చెప్పారు. వేంకటేశ్వరస్వామికి నిత్యం నివేదించే ముత్యాల హారతి కీర్తన వెంగమాంబదేనని అన్నారు. కె.రాఘవేంద్రరావు తనను దొరస్వామిరాజుకు పరిచయం చేయడం వల్లనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే మహదవకాశం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రంలో 22 పాటలు ఉన్నాయనీ, కీరవాణి ఎంతో సమయం వెచ్చించి చక్కటి స్వరాలను సమకూర్చారనీ చెప్పారు. మీనా మాట్లాడుతూ, 'సీతారామయ్య గారి మనుమరాలు' చిత్రంతో తనను హీరోయిన్ గా పరిచయం చేసిన దొరస్వామిగారి బ్యానర్ లోనే 'వెంగమాంబ' వంటి భక్తిరస చిత్రం చేస్తుండటం తన పూర్వజన్మ సుకృతమని అభివర్ణించారు. గతంలో పలుమార్లు అమ్మవారి పాత్రలు పోషించినప్పటికీ ఈ చిత్రంలో వృత్తిపరంగా ఎనలేని సంతృప్తి కలిగిందని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి పాత్రధారి సాయికిరణ్ మాట్లాడుతూ, కె.రాఘువేంద్రరావు కారణంగానే తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కలిగిందని అన్నారు. ఇందులో 22 పాటలు, పద్యాలు ఉన్నాయని కీరవాణి తెలిపారు. మంచి చిత్రంలో నటించామనే తృప్తి కలిగిందని శరత్ బాబు, అశోక్ కుమార్, కృష్ణవేణి తదితరులు పేర్కొన్నారు. దొరస్వామి రాజు మాట్లాడుతూ, జూన్ 7న తిరుపతిలో ఈ చిత్రం ఆడియో విడుదల చేసి, జూలై 4న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|