'ప్రయాణం'లో నవ్విస్తా : బ్రహ్మి
హాస్యాన్ని ఇష్టపడే అందరూ బ్రహ్మి అని ముద్దుగా పిలుచుకునే బ్రహ్మానందం మరోసారి ప్రేక్షకులతో నవ్వుల 'ప్రయాణం' చేయించబోతున్నారు. రెండు గంటల నవ్వుల వినోదం గ్యారెంటీ అంటున్నారు. మనోజ్ కుమార్, హారిక జంటగా ఆర్యక్తి ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'ప్రయాణం' చిత్రంలో తన పాత్ర అందర్నీ వినోదంలో ముంచెత్తుతుందని బ్రహ్మానందం తెలిపారు. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో బ్రహ్మానందం బుధవారంనాడు ఆ విశేషాలను ముచ్చటించారు.
రెండు గంటల పాటు ఎయిర్ పోర్ట్ లో ముగిసే క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందిందనీ, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి వైవిధ్యభరితంగా ఈ చిత్రాన్ని మలిచారనీ చెప్పారు. ఏలేటి గతంలో 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు' వంటి విభిన్న తరహా చిత్రాలను అందించిన ఏలేటి ఈ చిత్రాన్ని కూడా కొత్తకోణంలో తెరకెక్కించారనీ, ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు ఉండవనీ తెలిపారు. మనోజ్, హారిక చక్కటి నటన ప్రదర్శించారని చెప్పారు. ఇందులో విదేశాలకు వెళ్లే రైతుగా ఓ విభిన్నమైన పాత్రను తాను పోషించాననీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారనీ అన్నారు. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పే సమయంలోనూ తాను ఎంతో సంతోషానికి గురయ్యానని చెప్పారు. సక్సెస్ ఫుల్ గా పూర్తయిన ఈ చిత్రం ప్రయాణం ప్రేక్షకుల ముందు సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవుతుందనే గట్టి నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రం తర్వాత తన కుమారుడు గౌతమ్ ('పల్లకిలో పెళ్లికూతురు' ఫేమ్) కథానాయకుడిగా ఆర్యకి ఆర్ట్స్ బ్యానర్ లోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక చిత్రం ఉంటుందని బ్రహ్మానందం వెల్లడించారు. ఈనెల 29న 'ప్రయాణం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Be first to comment on this News / Article!
|