ఇప్పట్లో పెళ్లి లేదన్నసుమంత్
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం తనమీద లేదనీ, భవిష్యత్ పట్ల పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాననీ హీరో సుమంత్ చెప్పారు. ఏడాదిన్నర పాటు 'బోణి' చిత్రానికి పనిచేసిన సుమంత్ ఇప్పుడు కొద్దిపాటి విశ్రాంతి మూడ్ లో ఉన్నారు. సంగీత దర్శకుడు రమణ గోగుల తొలిసారి నిర్మాతగా మారి రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో 'బోణి' చిత్రాన్ని రూపొందించారు. జూన్ ప్రథమార్థంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సుమంత్ సైతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐపిల్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ తిలకించేందుకు వెళ్తున్నారు.
'సత్యం' చిత్రం తర్వాత మళ్లీ అంతటి సకెస్స్ ను ఆయన సాధించలేదనే అభిప్రాయంతో సుమంత్ ఏకీభవించారు. 'అందులో నిజం లేకపోలేదు. అలాగని ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తి కూడా లేదు. నిజానికి కెరీర్ మొదట్లో ఇబ్బందులు పడ్డాను. సత్యం చిత్రం సాధించిన హిట్ తో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విమర్శుకులు మరోలా విశ్లేషించి ఉండొచ్చుకానీ నేను నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్లు లేకపోయినా చాలా మటుకు కమర్షియల్ హిట్సే. ఇంతవరకూ కెరీర్ సాగిన తీరుగురించి అడిగితే నిశ్చయంగా నేను సక్సెస్ అయ్యానని చెప్పగలను' అంటూ సుమంత్ ధీమా వ్యక్తం చేశారు. పర్సనల్ లైఫ్ లోనూ కీర్తిరెడ్డితో ఆయన విడిపోవడం గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కీర్తిరెడ్డికి దూరం కావడం ఆయనలోని మానసిక స్థైర్యాన్ని నీరుగార్చిందా? ఎంతమాత్రం కాదని సుమంత్ తొలిసారి స్పందించారు. 'ఇద్దరం విడిపోయాం. హ్యాపీగానే ఉన్నాం. కీర్తి ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డ కూడా. ఆ ఎపిసోడ్ కు తెరపడింది. అయితే ఇప్పటికీ కీర్తి కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉన్నాను. చేదు గాయాలేవీ లేవు. అంతా సుఖాంతమైంది' అంటూ చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతం తనకు లేదనీ, ఆ ప్రభావం తన కెరీర్ మీద కూడా ఎంత మాత్రం ఉండబోదని సుమంత్ నవ్వుతూ వివరణ ఇచ్చారు.
Be first to comment on this News / Article!
|