సినిమా పుస్తకాల ఆవిష్కరణ
విజయా పబ్లికేషన్స్ ప్రచురించిన ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి స్వీయ చరిత్ర 'జ్ఞాపకాల పందిరి', పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రచించిన 'ఆనాటి ఆనవాళ్లు' పుస్తకాల ఆవిష్కరణ హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో గురువారంనాడు జరిగింది. డాక్టర్ డి.రామానాయుడు, డివిఎస్ రాజు, కె.ఎస్.రామరావు, తమ్మారెడ్డి భరద్వాజ, నాగిరెడ్డి తనయుడు విశ్వనాథ రెడ్డి (విశ్వం), తనికెళ్ల భరణి, పులగం చిన్నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'జ్ఞాపకాల పందిరి' పుస్తకాన్ని డి.రామానాయుడు ఆవిష్కరించి తొలి ప్రతిని కెఎస్ రామారావుకు అందజేశారు. 'ఆనాటి ఆనవాళ్లు' పుస్తకాన్ని డివిఎస్ రాజు ఆవిష్కరించి తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు.
బి.నాగిరెడ్డి జీవిత అనుభవాలను ఆయన మాటల్లోనే సంగ్రహించి 'జ్ఞాపకాల పందిరి' పుస్తకాన్ని రూపొందించారు. ఇందులో ఆయన పుట్టి పెరిగిన గ్రామం, మద్రాసులో ప్రెస్ నిర్వహణ, స్థాపించిన పత్రికలు, నిర్మాతగా సినీ ప్రస్థానం వంటివన్నీ క్రోడికరించారు. 'ఆనాటి ఆనవాళ్లు'లో 1931 నుంచి 1980 దశకం వరకూ విడుదలైన ఆణిముత్యాల్లాంటి 75 సినిమాలకు సంబంధించిన కథలు, తెరవెనుక విశేషాలను చిన్నారాయణ పొందుపరిచారు. ఈ సందర్భంగా స్వర్గీయ బి.నాగిరెడ్డితో తమకున్న అనుబంధాన్ని రామానాయుడు, డివిఎస్ రాజు వివరించారు. ఆ రోజుల్లోనే ఎన్నో గొప్ప చిత్రాలను తీసిన నాగిరెడ్డి నేటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచారని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసించారు. తమ సంస్థ ద్వారా మరిన్ని పుస్తకాలను ప్రచురించి త్వరలోనే ఆవిష్కరిస్తామని విశ్వనాథ రెడ్డి తెలిపారు.
Be first to comment on this News / Article!
|