నమితతో శ్రీహరి!
విజయశాంతి తరహాలో లేడీ కాప్ గా నమిత నటిస్తున్న 'దేశద్రోహి' చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి వచ్చి చేరబోతున్నారు. పోలీసు పాత్రల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న శ్రీహరిని ఇందులోని ఓ కీలక పాత్రకు దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన రెండో షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుగుతుండగా, తదుపరి షెడ్యూల్ లో శ్రీహరి పాల్గొనబోతున్నారని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై జి.వి.హెచ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నమిత తొలిసారి పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ ప్రస్తుతం గోల్గొండ ఫోర్ట్ వద్ద జరుగుతోంది. నమిత, రవి, శోభన్ లపై ఫైట్ మాస్టర్ విజయన్ శిష్యుడు పవర్ స్టార్ సారథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోంది. జూలై వరకూ జరిగే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, రామిరెడ్డి, వల్లభనేని జనార్థన్, కృష్ణ భగవాన్, సన, రవి, శోభన్, ప్రత్యేక పాత్రలో శాంతిచంద్ర తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి సినీ చిత్ర యూనిట్ కథ, కమలేష్ కుమార్ స్క్రీన్ ప్లే, కిషన్ సాగర్ సినిమాటోగ్రఫీ, రాంబాబు ఎడిటింగ్, శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|