ప్రేమలో పడిన వరుణ్
ప్రేమ అనేది ఎవరిలో ఎప్పుడు కలుగుతుందో చెప్పలేం. ప్రేమలో పడడానికి కారణాలు కూడా అక్కర్లేదు. ప్రేమలో పడిన యువతీయువకులకు ప్రపంచమంతా కొత్తగా, వింతగా ఉంటుంది. అదో అందమైన ప్రపంచం. సరిగ్గా ఇదే కథాంశంతో రూపొందుతున్న ప్రేమ కథా చిత్రం 'ఎవరైనా ఎపుడైనా'. దీనికి 'ప్రేమలో పడొచ్చు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ప్రేమలో పడిన యువతీయువకుల జంటగా వరుణ్ సందేశ్, విమలారామన్ నటించారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణ్ గుహన్, అపర్ణ గుహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు మార్తాండ్ కె.శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
మార్తాండ్ కె.శంకర్ మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టే ఈ చిత్రం మంచి ప్రేమకథా ఇతివృత్తంతో, సకుటుంబ సమేతంగా చూడదగని చిత్రంగా ఉంటుందనీ, వరుణ్ సందేష్ పాత్ర, ఆయన స్వభావం వైవిధ్యంగా ఉంటుందనీ చెప్పారు. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న యువకుడిగా వరుణ్, కళాశాల విద్యార్థినిగా విమలారామన్ నటించారని తెలిపారు. ఓ యువకుని జీవితంలో ప్రేమ, దాని తాలూకు జ్ఞాపకాలు, మరుపురాని అనుభవాలు...వీటిని ఆస్వాదించే యువకుడిగా వరుణ్ ఇందులో నటిస్తే, ఈ కథకు హీరోయిన్ పాత్ర కేంద్రబిందువు అవుతుందన్నారు. ఈనెలలోనే ఆడియో , జూన్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట, గిరిబాబు, ఆలీ, రమాప్రభ తదితరులు నటించారు. రాజసింహ మాటలు, వేణుగోపాలని సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|