టి-20 వరల్డ్ కప్ కు వెంకీ
ఇప్పుడంతా క్రికెట్ సీజన్ నడుస్తోంది. దక్షిణాఫ్రికాలో ఆదివారం జరిగే ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ వెండితెర వేల్పులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. టాలీవుడ్ ప్రముఖుల విషయానికి వస్తే...వెంకటేష్, తరుణ్, విష్ణు, నిర్మాత డి.సురేష్ బాబు ఇలా పలువురు క్రికెట్ వీరాభిమాలుగా అందరికీ తెలుసు. వెంకటేష్, సురేష్ బాబు అయితే వరల్డ్ టీమ్ లకు వెళ్లేందుకు ప్రతిసారి ఉత్సాహం చూపిస్తుంటారు. ఐపిఎల్ మ్యాచ్ లను ఇంటిలో ఉండే తిలకించిన వెంకటేష్ అతి త్వరలోనే లండన్ పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జూన్ లో జరిగే టి-20 వరల్డ్ కప్ పోటీలను ఆయన అక్కడ ప్రత్యక్షంగా తిలకిచనున్నారు.
ఈ విషయాన్ని వెంకటేష్ ధ్రువీకరిస్తూ 'మన ఇండియన్ టీమ్ ను ఉత్సాహ పరచేందుకు నేను బయలుదేరి వెళ్తున్నాను' అని వెంకటేష్ తెలిపారు. వెంకటేష్ కు క్రికెట్ లో మంచి నైపుణ్యం కూడా ఉంది. హైద్రాబాద్ లో టాలీవుడ్ స్టార్స్ మధ్య జరిగిన పలు మ్యాచ్ లు తిలకించిన వారికి వెంకటేష్ బ్యాటింగ్ స్కిల్స్ గురించి కూడా బాగానే తెలుసు. లండన్ లో ఎన్నిరోజులు ఉండబోతున్నారనే ప్రశ్నకు వెంకీ సమాధానమిస్తూ, టోర్నమెంట్ లో మన టీమ్ ప్రోగ్రస్ ను బట్టే ఎన్ని రోజులు ఉండాలనేది నిర్ణయించుకుంటాననీ, అయితే ధోని నాయకత్వంలో ఇండియన్ టీమ్ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందనే నమ్మకం తనకుందనీ చెప్పారు. ఆ ప్రకారం ఫైనల్స్ పూర్తయిన తర్వాతే తిరిగి హైద్రాబాద్ చేరుకునే అవకాశముందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న 'ఈనాడు' చిత్రంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వెంకీ సోలో హీరోగా నటించే తదుపరి చిత్రం మాత్రం వరల్డ్ కప్ సిరీస్ పూర్తయిన తర్వాతే ఉండే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|