నాగబాబు 'సాధు' ట్రైలర్స్
మానవతా మూర్తిగా సాహసోపేతమైన పాత్రలో నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్ ను హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. నాగబాబు, అంజి, నిర్మాత ఎల్.వి.రాజుతో పాటు ముఖ్య అతిథులుగా సి.కల్యాణ్, వి.వి.వినాయక్, శ్రీను వైట్ల పాల్గొన్నారు.
నాగబాబు మాట్లాడుతూ, దర్శకుడు అంజి ఈ చిత్ర కథను చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించారనీ, దర్శకుడిగా ఆయనకు మంచి పేరు వస్తుందనీ చెప్పారు. ఒక చిన్నబాబు చుట్టూ తిరిగే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ, ట్రైలర్స్ చాలా బాగున్నాయనీ, మంచి ఎమోషన్స్ తో, టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం తీసినట్టు కనిపిస్తోందని అన్నారు. దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ట్రైలర్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే భావన కలుగుతోందని శ్రీనువైట్ల అన్నారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ, తాను సహాయ దర్శకుడిగా పనిచేసిన మొదటి చిత్రానికి నిర్మాత ఎల్.వి.రాజు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారనీ, ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని వినాయక్ అన్నారు. నాగబాబు, నిర్మాత రాజు ఇచ్చిన సహకారంతో సినిమా బాగా తీయగలిగానని అంజి పేర్కొన్నారు. జూన్ మొదటివారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత రాజు తెలిపారు.
Be first to comment on this News / Article!
|