ప్రభాకర్ సీరియల్ 'ముద్దుబిడ్డ'
బుల్లితెర నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వెండితెర నటుడిగా కూడా రాణిస్తున్న ప్రభాకర్ మరోసారి 'ముద్దుబిడ్డ' అనే సీరియల్ ద్వారా వీక్షకులను అలరించబోతున్నారు. ఈ సీరియల్ ద్వారా ప్రభాకర్ దర్శక నిర్మాతగా కూడా మారడం విశేషం. శ్రీ సుమనోహర ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఈ సీరియల్ ను నిర్మిస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఈ డైలీ సీరియల్ సోమవారం నుంచి గురువారం వరకూ ప్రతిరోజు రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకూ ప్రసారమవుతుంది. హైద్రాబాద్ లోని ఫిలింనగర్ లో శుక్రవారంనాడు జరిగిన కార్యక్రమంలో దర్శకురాలు మంజులానాయుడు చేతుల మీదుగా సంస్థ ప్రారంభం కాగా, సినీ నటుడు బహ్మాజీ హోర్డింగ్ శాంపిల్స్ ను విడుదల చేశారు.
ప్రభాకర్ మాట్లాడుతూ, నటుడు-దర్శకుడు ప్రదీప్ ద్వారా తాను బుల్లితెరకు పరిచయమయ్యాయనీ, మంజులానాయుడు దర్శకత్వంలో రూపొందిన 'రుతురాగాలు' సీరియల్ తనకు మంచి పేరు తెచ్చిందనీ అన్నారు. నటనలో ఎన్నో మెలకువలు మంజులానాయుడు దర్శకత్వంలోనే నేర్చుకున్నానని అన్నారు. ఆ తర్వాత తన మిత్రుడు సుమన్ వద్ద రచన, దర్శకత్వం గురించి తెలుసుకున్నాననీ, కష్టపడే తత్వం కూడా ఆయన వద్ద నుంచే తనకు అబ్బిందనీ అన్నారు. ఆయన సమక్షంలోనే తన సంస్థ ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నప్పటికీ ఆయన ఔట్ డోర్ లో ఉన్నారనీ, ఈనెల 25 నుంచి సీరియల్ ప్రసారమవుతున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితులలో ఈ కార్యక్రమం జరుపుతున్నామనీ చెప్పారు. సుమన్ పేరు కలిసి వచ్చేలా తన సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంతవరకూ ఈటీవీ ప్రభాకర్ గా గుర్తింపు పొందిన తనకు ఈ సీరియల్ తో జీటీవీ ప్రభాకర్ గా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. తన నిర్మాణ సంస్థ ద్వారా సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా తీయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇదే డిసెంబర్ లో సినిమా ప్రారంభించాలనే ఆలోచన ఉందని చెప్పారు. నటులు బ్రహ్మాజీ, ప్రదీప్, సంగీత దర్శకుడు బంటి తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|