'బిల్లా' 50 రోజుల వేడుక
ప్రభాస్, అనుష్క, నమిత, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ దర్శకుడిగా గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిన 'బిల్లా' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని 'దేవి' థియేటర్ లో శుక్రవారం సాయంత్రం అభిమానుల సమక్షంలో సందడిగా జరిగింది. ఆల్ ఇండియా కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు సారథ్యంలో ఈ వేడుక జరిగింది. కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలాదేవి, నిర్మాతల్లో ఒకరైన ప్రబోధ్, దేవీ థియేటర్ కు చెందిన మక్సాద్, జ్ఞానేశ్వర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
తొలుత శ్రీమతి శ్యామలాదేవి కేట్ కట్ చేశారు. అభిమానులు చిత్రయూనిట్ ను శాలువాలు, పూలదండలతో సన్మానించారు. కృష్ణంరాజు మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తమ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభాస్ ను ఎంతో స్టయిలిష్ గా చూపుతూ దర్శకుడు మెహర్ రమేష్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీశారని అన్నారు. ఏభై రోజుల పండుగను తన అభిమానులు జరుపుతున్నందున శతదినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ప్రభాస్, ఆయన పెదనాన్న కృష్ణంరాజు కాంబినేషన్ లో తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, కృష్ణంరాజు ఎక్కడా ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమా తీయమని ప్రోత్సహించడంతో అంతే రిచ్ గా సినిమా తీయగలిగాననీ అన్నారు. ప్రేక్షకులు ఇంత మంచి సక్సెస్ ఇవ్వడం తనకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు. కృష్ణంరాజు గతంలో నటించిన పలు సినిమాలు ఇదే థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శితమయ్యాయనీ, ప్రభాస్ 'ఈశ్వర్' చిత్రం కూడా ఈ థియేటర్ లో ప్రదర్శించామనీ, ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించిన 'బిల్లా' మంచి ప్రేక్షకాదరణ చూరగొనడం సంతోషంగా ఉందనీ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ఈ సినిమా ఇంత మంచి ఆదరణ చూరగొనడం సంతోషంగా ఉందని శ్యామలాదేవి, ప్రబోధ్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|