'ఆ ఒక్కడు' 5కు వాయిదా
పలు చిత్రాల్లో ప్రతినాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ 'ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తొలిసారి కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. అమెరికాలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను డిస్ట్రి బ్యూషన్ చేసిన 'టాలీ 2 హాలీ మూవీస్' సంస్థ తొలిసారి చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ అజయ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మించారు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈనెల 29న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ మరో వారం రోజుల పాటు విడుదల తేదీని వాయిదా వేశారు. 29న 'ప్రయాణం', 'పిస్తా' వంటి పలు చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో కొత్త తేదీని ఖరారు చేశారు.
పదిమందిలో ఒక్కడిని గుర్తించేటప్పుడు 'ఆ ఒక్కడు' అంటుంటామనీ, అలాంటి ఆ ఒక్కడు ఏం చేశాడన్నదే తమ చిత్ర కథాంశమని దర్శకనిర్మాతలు తెలిపారు. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ...ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందిందనీ, గ్లామర్ బ్యూటీ మధురిమను ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామనీ అన్నారు. తమ సినిమా స్టిల్స్ చూసి ఇప్పటికే మధురిమకు పలు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయనీ, కథానాయకుడిగా అజయ్ తొలి సినిమా విడుదలకు ముందే వరుస ఆఫర్లు వచ్చాయనీ చెప్పారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రత్యేక పాత్రతో నటించగా, ధర్మవరపు సుబ్రమణ్యం, సునీల్ తదితరులు హాస్యంతో అలరించనున్నారని చెప్పారు. తమ తొలి సినిమాకే మణిశర్మ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడం, ఆడియో మంచి సక్సెస్ కావడం సినిమాపై తమ అంచనాలను మరింత పెంచినట్టు వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|