ఫోటో షూట్ కు ప్రియమణి రెడీ
ప్రియమణి ఇప్పుడు పలు వదంతులకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఆ వదంతులు ఇప్పట్లో ఆమెను వదిలిపెట్టేలా కూడా లేవు. అయితే ప్రియమణి సైతం వీటిని ఖాతర చేయకుండా నిబ్బరం ప్రదర్శిస్తోంది. ఇటీవల 'ద్రోణ' చిత్రంలో బికినీ ధరించడంతో ఒక్కసారిగా ప్రియమణి అందరి దృష్టినీ అకర్షించింది. ఆ వెనువెంటనే...ఒక పురుషుల మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రియమణి కనిపించనుందనీ, ఫోటో షూట్ కు కూడా వెళ్తోందనీ వార్తలు మొదలయ్యాయి. దీనిపై ప్రియమణి కూల్ గానే స్పందించింది 'ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అయితే ఆ మ్యాగజైన్ నుంచి ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు. గతంలో పలు ప్రాంతీయ మ్యాగజైన్ల కవర్ కోసం ఫోటో షూట్ చేశాను. అలాంటి ఎక్స్ క్లూజివ్ షూట్స్ చేయడం ఎంతో ప్లెజెంట్ గా ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది.
'ద్రోణ'లో బికినీ ధరించడానికి 20 లక్షలు అదనంగా ప్రియమణి డిమాండ్ చేసిందనీ, సినిమా బాగా ఆడకపోవడంతో నిర్మాత ఆ డబ్బులు ఇవ్వలేదనీ వస్తున్న వదంతులను సైతం ఆమె ఖండించింది. నిర్మాత తనకు ఇస్తానన్న సొమ్ము చెల్లించారనీ, మొదట్లో అంచనాలకు అనుగుణంగా సినిమా వసూళ్లు లేవని భావించిన నిర్మాత కొద్దిగా వెనుకంజ వేశారనీ, అయితే ఆ తర్వాత తనకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించి తన ప్రొఫెషనలిజం చాటుకున్నారనీ చెప్పుకొచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు 'వరుడు' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా తాను నటించనున్నట్టు వినిపివస్తున్న వదంతుల్లోనూ నిజ లేదని ఆమె తెలిపారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదనీ, అదీగాక తాను ఇంతవరకూ మహేష్ బాబును చూడడం కానీ, కలుసుకోవడం కూడా జరగలేదనీ చెప్పింది. అలాంటప్పుడు 'వరుడు' చిత్రం కోసం మహేష్ తో కలిసి ఫోటో షూట్ లో పాల్గొనడం ఎలా సాధ్యమని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది. లీడ్ హీరోయిన్ పాత్రకు అవకాశమిస్తే మాత్రం ఆ ఆఫర్ వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. అలాగే నటుడు పృధ్వీరాజ్ తో తన పేరు జోడించి వస్తున్న వదంతుల్లోనూ నిజం లేదనీ, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేననీ, అంతకుమించి ఎలాంటి అనుబంధం లేదనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగులో జగపతిబాబు సరసన మదన్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యాననీ, మణిరత్నం దర్శకత్వంలో హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న 'రావణ్', కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తో 'రామ్' చిత్రం నిర్మాణంలో ఉన్నాయని తెలిపింది.
Be first to comment on this News / Article!
|