సోనియా లవ్ స్టోరీ
'హ్యాపీడేస్', 'వినాయకుడు' చిత్రాలతో యువతరాన్ని ఆకట్టుకున్న సోనియా మరోసారి ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమవుతోంది. సోనియా పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రాన్ని శ్రీ విజయగణపతి క్రియేషన్ బ్యానర్ పై శ్రీమతి అరుణ సమర్పణలో ఎం.రామలింగరాజు నిర్మిస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకుడు. యువతకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ కథానాయకుడుగా, కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్) మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కావలసి ఉంది.
ఇది విలక్షణమైన ప్రేమకథా చిత్రమనీ, యువతకు మంచి సందేశం కూడా ఇందులో ఉంటుందనీ జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. తొలి షెడ్యూల్ 20 రోజుల పాటు జరిపి మలి షెడ్యూల్ ఈనెల 11 నుంచి ప్రారంభించామని చెప్పారు. నెలాఖరు వరకూ జరిగే షెడ్యూల్ తో ఒక పాట చిత్రీకరణ కూడా ఉంటుందని చెప్పారు. హీరో రాజీవ్ క్యారెక్టర్ ఎక్స్ టార్డినరీగా ఉంటుందనీ, హీరో పాత్రను చూసి అమ్మాయిలు కూడా ఇన్ స్పైర్ అవుతారనీ చెప్పారు. సోనియా తొలిసారి పూర్తి స్థాయి హీరోయిన్ గా నటిస్తోందన్నారు. అలాగే రాజీవ్ ఫ్రెండ్ గా కృష్ణుడు మరో ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. కోటి తనయుడు రాజీవ్ లో మంచి స్పార్క్ ఉందనీ, దర్శకుడు చెప్పిందే తడవుగా అందిపుచ్చుకుని చక్కటి నటన ప్రదర్శిస్తున్నాడనీ నిర్మత రామలింగరాజు చెప్పారు. ఈ చిత్రానికి కోటి అందిస్తున్న సంగీతం మరో హైలైట్ అవుతుందనీ, సినిమా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కాశీ విశ్వనాథ్ ('నచ్చావులే' ఫేమ్), ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, మేల్కొటి, దువ్వాసి, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి భూపతిరాజా కథ, మరుధూరి రాజా మాటలు, డి.ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|