మనోజ్ సరసన ఇలియానా
దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కైనా పండుగే. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘువేంద్రరావు పక్కా కమర్షియల్ చిత్రాలతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ వచ్చారు. హీరోయిన్లను పాటల్లో గ్లామరస్ గా చూపించడంలో రాఘువేంద్రరావు స్టైలే వేరు. శ్రీదేవి, జయప్రద, రమ్యకృష్ణ వంటి ఎందరెందరో హీరోయిన్లకు స్టార్ డమ్ తెచ్చారాయన. దర్శకేంద్రుడు ఇటీవల కాలంలో భక్తిరస ప్రధాన చిత్రాలకే పరిమితమవుతూ వస్తున్నా హీరోయిన్లను అందంగా చూపించడంలో తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు. ఇవాల్టి తరం హీరోయిన్లకు ఆయనతో మాస్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాల్లో పనిచేసే అవకాశాలు దాదాపు లేనట్టేనని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ తన పాత స్కూలు నుంచే ఓ మాస్ మషాలా చిత్రానికి రెడీ అవుతున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ బ్యానర్లలో ఒకటైన లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రాన్ని త్వరలోనే దర్శకేంద్రుడు తెరకెక్కించనున్నారు. లక్ష్మీప్రసన్న నిర్మాత. తాజాగా ఈ చిత్రంలో మనోజ్ కు జోడిగా సంచలన కథానాయిక ఇలియానాను ఎంపిక చేసినట్టు సమాచారం.
మనోజ్ కు జోడిగా ఇలియానా నటించనుండటం ఇదే ప్రథమం. దీంతో మంచు సోదరులిద్దరితో పనిచేస్తున్న హీరోయిన్ క్రెడిట్ కూడా ఇలియానాకు దక్కబోతోంది. ప్రస్తుత మనోజ్ సోదరుడు విష్ణువర్దన్ కథానాయకుడిగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సలీమ్' చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తోంది. దీనికితోడు నితిన్ సరసన పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'రెచ్చిపో' చిత్రంలోనూ ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మంచు మనోజ్ తాజా చిత్రమైన 'ప్రయాణం' ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత క్రిష్ 'వేదం', రాఘువేంద్రరావుతో సొంత బ్యానర్ చిత్రాల్లో మనోజ్ నటించనున్నారు.
Be first to comment on this News / Article!
|