బాలకృష్ణ జంటగా నయనతార
'మిత్రుడు' చిత్రం తర్వాత బాలకృష్ణ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో కొత్త చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ('గుండె ఝల్లుమంది' ఫేమ్) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ టీమ్ లో బాలకృష్ణకు జోడిగా నయనతార ఎంపికైనట్టు సమాచారం. అబ్బాయ్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం 'అదుర్స్ ' చిత్రంలో నటిస్తున్న నయనతార ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణతోనూ కమిట్ కావడం విశేషం.
నందమూరి హీరోలందరితోనూ నటించిన క్రెటిట్ ఇంతవరకూ ప్రియమణికి దక్కింది. 'యమదొంగ'లో ఎన్టీఆర్ తో, 'హరేరామ్'లో కల్యాణ్ రామ్ తో, 'మిత్రుడు'లో బాలకృష్ణతో ప్రియమణి నటించింది. నయనతార సైతం నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో నటించినప్పటికీ బాలకృష్ణతో నటించనుండటం ఇదే ప్రథమం. అద్భతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో బాలకృష్ణ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా తమ తాజా చిత్రం ఉంటుందని పరుచూరి కిరీటి చెబుతున్నారు. బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ పై కూడా ఆయన ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. గతంలో 'లారీ డ్రైవర్' , 'నరసింహ నాయుడు', 'సమర సింహారెడ్డి' వంటి సెన్సేషన్ హిట్ చిత్రాలు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. బి.గోపాల్ సైతం కొద్ది గ్యాప్ తర్వాత ఇటీవల రామ్ హీరోగా 'మస్కా' చిత్రానికి దర్శకత్వం వహించారు. సంక్రాంతి చిత్రాల రేసులో ఈ చిత్రం కమర్షియల్ గా నిలబడింది. ఈ క్రమంలో బి.గోపాల్ సైతం మళ్లీ బాలకృష్ణ చిత్రం ద్వారా ఇద్దరి కాంబినేషన్ కూ పూర్వవైభవం తెచ్చిపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|