'మల్లన్న' కథేంటి?
'అపరిచితుడు' సాధించిన సంచనల విజయం తర్వాత మళ్లీ అంత మంచి పేరు తెచ్చే చిత్రం 'మల్లన్న' (తమిళ 'కందసామి') అవుతుందని హీరో విక్రమ్ ఎంతో ధీమాగా ఉన్నారు. సహజంగానే తాను నటించే చిత్రాలకు స్యయంగా ప్రమోషన్ వర్క్ లో పాల్గొనే విక్రమ్ ఈసారి మరింత ఉత్సాహంగా సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. ఏడాదిన్నర పాటు ఈ చిత్ర నిర్మాణానికి వెచ్చించిన విక్రమ్ ఈ చిత్రంలో నాలుగు పాటలకు నేపథ్యగానం అందించడంతో పాటు కొన్ని స్పెషల్ ఫైట్స్ ను ఆయనే డిజైన్ చేసుకోవడం, ఐదు గెటప్స్ లో కనిపించనుండటం హైలైట్స్ కానున్నారు. సూపర్ హీరో తరహాలో ఆయన పాత్ర ఉండబోతోంది. సుశీ గణేషన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను 40 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినీ వర్గాల కథనం ప్రకారం ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుంది. ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు ఓ పరిష్కారం ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు సుశీ గణేషన్ చేశారు. ధనికులు, పేదల మధ్య అంతరాన్నితొలగించేందుకు అవసరమైన పరిష్కారాన్ని ఇందులో కథానాయకుడు చూపించబోతున్నారు. అమెరికాలో పుట్టిపెరిగి ఇండియా వచ్చిన సుబ్బలక్ష్మి (శ్రియ) మొదట్లో హీరోను అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అతని లక్ష్యానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. కథానుగుణంగా జనం తమ బాధలు, కష్టాలను మొక్కులరూపంలో 'మల్లన్న' స్వామికి నివేదించుకునేందుకు చీటీలు రాసి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టుకు వేలాడదీస్తుంటారు. వాటిని కథానాయకుడు మల్లన్న చదివి తనదైన శైలిలో పరిష్కరిస్తుంటాడు. ఇది దైవానుగ్రహంగా జనం భావిస్తుంటారు. అలా జనం మదిలో హీరో దైవంగా నిలుస్తాడు. ఈ చిత్రంలో విక్రమ్ ఆడవేషం వేయడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. 15 నిమిషాల పాటు ఈ పాత్ర ప్రేక్షకులను అలరించనుంది. కమల్ 'దశావతారం' చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన దేవీశీప్రసాద్ ఈ చిత్రానికి గ్రాండ్ స్కేల్ మ్యూజిక్ ఇవ్వడంతో పాటు ఇందులోని 'అలెగ్రా' పాట ఇప్పటికే ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. 'మల్లన్న' సృష్టించబోయే 'సి'త్రాలు మరిన్ని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. జూన్ లో 'మల్లన్న' స్వైరవిహారం చేయనున్నాడు.
Be first to comment on this News / Article!
|