కామెడీగా 'బెండు అప్పారావు'
అల్లరి నరేష్ కథానాయకుడుగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ 'బెండు అప్పారావు ఆర్ఎంపి'. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకూ 50 శాతం టాకీ, 3 పాటల చిత్రీకరణ పూర్తయింది. రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం ప్రోగ్రస్ ను చిత్రయూనిట్ తెలియజేసింది.
ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ, 'ప్రేమఖైదీ' చిత్రం తర్వాత మళ్లీ రామానాయుడు గారి బ్యానర్ లో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ, రెండు గంటల పాటు పూర్తి వినోదంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. ఏప్రిల్ 2 షూటింగ్ ప్రారంభించి 20 రోజుల పాటు నానక్ రామ్ గూడలో టాకీ తీశామనీ, ఈనెల 6 నుంచి జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియాలలో మూడు పాటల చిత్రీకరణ జరిపామనీ చెప్పారు. దీంతో ఏబై శాతం టాకీ పూర్తయిందన్నారు. జూన్ 1 నుంచి రాజమండ్రిలో జరిపే రెండో షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని చెప్పారు. రామానాయుడు మట్లాడుతూ, చాలాకాలం తర్వాత ఇవివి కాంబినేషన్ లో తాము ఈ చిత్రం చేస్తున్నామనీ, మంచి సక్సెస్ కోసం అంతా కష్టపడుతున్నారనీ చెప్పారు. సురేష్ బ్యానర్ తన మాతృసంస్థలాంటిందని నరేష్ అభివర్ణించారు. తనపైన, తన తండ్రిపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, జీవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|