జూలైలో వస్తున్న 'మగధీర'
'చిరుత'గా పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలిచిత్రంతోనే యాక్షన్ హీరో ఇమేజ్ ను తెచ్చుకున్న రామ్ చరణ్ ఈసారి విలక్షణ ప్రేమకథా ఇతివృత్తంతో 'మగధీర'గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగుని కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న ఎస్.ఎస్.రాజమౌళి తొలిసారి తన ట్రాక్ మార్చి ప్రేమకథా ఇతివృత్తాన్నిహ్యాండిల్ చేయడంతో సహజంగానే 'మగధీర' చిత్రం ఈ ఏడాది విడుదలవుతున్న ప్రిస్టేజియస్ క్రేజీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలుస్తోంది. హిందీ 'గజనీ'తో ఆలిండియా రికార్డులను తిరగరాసిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడం కూడా ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు జోడిగా అందాల నటి కాజల్ నటించింది.
పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. కథానుగుణంగా గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోందనీ, ఇందుకోసం ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతోందని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాజమౌళి రెగ్యులర్ చిత్రాల సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అత్యద్భుతమైన బాణీలను సమకూర్చారనీ, మ్యూజికల్ హిట్ ఖాయమనీ చెబుతున్నారు. ఇందులో 6 పాటలు ఉండగా, 'ఘరానామొగుడు' చిత్రంలో టాప్ సాంగ్ గా అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'బంగారు కోడిపెట్ట' అనే రీమిక్స్ సాంగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోంది. ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి స్టెప్ట్ వేయడం ప్రత్యేకతను సంతరించుకోనుంది. పలు విశిష్టతలు ఉన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ రెండోవారంలో ఆడియో, జూలై నెలాఖరులలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|