యూత్ హార్ట్ త్రోబ్ వరుణ్ సందేశ్ ఎలాంటి సినీ బ్రాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు వరుస హిట్ లు సాధించారు. 'ఎవరైనా ఎపుడైనా' చిత్రంతో ఇప్పుడు హ్యాటిక్ కు సిద్ధపడుతున్నారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై మార్తాండ్ కె.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే మంచి బిజినెస్ కూడా చేసింది. ఆసక్తికరంగా ఈ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
వరుణ్ 'హ్యాపీడేస్' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకనిర్మాత అయినప్పటికీ ఆ చిత్రం పంపిణీ హక్కులను అప్పట్లో దిల్ రాజు తీసుకున్నారు. వరుణ్ రెండో చిత్రమైన 'కొత్త బంగారులోకం' దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైనే రూపొంది మంచి విజయం సొంతం చేసుకుంది. వరుణ్ హీరోగా దిల్ రాజు తన తదుపరి చిత్రమైన 'మరో చరిత్ర' చిత్రాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభించారు. రవి యాదవ్ దర్శకత్వంలో యుఎస్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది కూడా. తెలుగులో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడనుండగా, తమిళ వెర్షన్ కోసం జెమినీ ఫిలిమ్స్ సర్క్యూట్స్ తో ఆయన టైయప్ కూడా పెట్టుకున్నారు. తాజాగా వరుణ్-విమలారామన్ జంటగా నటించిన 'ఎవరైనా ఎపుడైనా' తొలి ప్రింట్ చూసిన దిల్ రాజు మరో మాటకు తావులేకుండా నైజాం ఏరియా రైట్స్ ను సొంతం చేసుకుని వరుణ్ తో తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. దిల్ రాజు పంపిణీ చేస్తున్నారంటే ఆ సినిమా సగం విజయం సాధించినట్టేననే సెంటిమెంట్ పరిశ్రమలో బలంగా కూడా ఉంది. అదే సెంటిమెంట్ వరుణ్ తాజా చిత్రం విషయంలోనూ మరోసారి నిరూపితమవుతుందనే అంచనాలు కూడా ఇప్పుడు ట్రేడ్ లో మొదలయ్యాయి. జూన్ 1న ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. అదే నెలాఖరులో సినిమా విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది.