సినిమా తర్వాత సినిమా చేస్తూ రామ్ చరణ్ తన కెరీర్ ను పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'చిరుత' తో సంచలన యువహీరో ఆనిపించుకున్న చరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'మగధీర'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై నెలాఖరులో 'మగధీర' విడుదలకు సిద్ధమవుతోంది. దీని తర్వాత 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రానికి రామ్ చరణ్ కమిట్ అయ్యారు. కొద్దికాలంగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ , నటీనటుల ఎంపికలో భాస్కర్ తలమునకలవుతున్నారు. తొలి రెండు చిత్రాలు బయట బ్యానర్ లో చేసిన రామ్ చరణ్ ఈ తాజా చిత్రాన్ని తన సొంత బ్యానర్ లాంటి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేయబోతున్నారు. నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా ఎంపికైనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.
జెనీలియా కెరీర్ కు భాస్కర్ 'బొమ్మరిల్లు' మంచి బ్రేక్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందులోని హాసిని పాత్ర ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ చిత్రం తర్వాత జెనీలియాకు యూత్ లోనూ అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం జెనీలియా తెలుగులో గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న 'కథ' చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు మరోసారి భాస్కర్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో జెనీలియా ఎగిరి గంతేసి ఆ ఆఫర్ ను ఆందిపుచ్చుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి హారిస్ జైరాజ్ సంగీత దర్శకత్వంలో రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. జూన్ నెలాఖరులను ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి రానుంది.