'కరెంట్' ఆడియో రిలీజ్
సుశాంత్, స్నేహఉల్లాల్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల సంయుక్తంగా నిర్మించిన 'కరెంట్' చిత్రం ఆడియో విడుదల శుక్రవారంనాడు కొత్త తరహాలో జరిగింది. ఆడియోలోని నాలుగు పాటలను
నలుగురు దర్శకులైన పూరీ జగన్నాథ్, సుకుమార్, శ్రీనువైట్ల, శేఖర్ కమ్ముల తమతమ నివాసాల్లో రిలీజ్ చేయగా, ఐదో పాటను అన్నపూర్ణా స్టూడియోస్ లో నాగార్జున ఆవిష్కరించారు. సుశాంత్, స్నేహ ఉల్లాల్, సూర్యప్రతాప్, నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు, చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, రచయితలు భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ఎన్నికల వేడి ముగిసిన తరుణంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయని అన్నారు. తాను చేసే సినిమా కథ ఇంకా ఖరారు కాలేదని అన్నారు. 'కరెంట్' సినిమా కథ గురించి తనకు తెలియదనీ, అయితే సినిమా బాగా వచ్చిందని టెక్నీషియన్లు చెప్పారనీ అన్నారు. సినిమా బాగా ఆడుతుందనే గట్టి నమ్మకం కలిగిందన్నారు. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ, ఆడియోలోని ఒక్కో పాటను ఒక్కొక్కరు విడుదల చేయడం సంతోషంగా ఉందనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. నాగార్జున సినిమాలంటే తనకు ఇష్టమనీ, ఆయన బ్యానర్ లో సినిమా నిర్మించడం తనకు సంతోషంగా ఉందనీ చింతలపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించారనీ, జూన్ 19న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఇందులోని ప్రతి ఒక్కరూ కష్టపడి టీమ్ వర్క్ తో పనిచేసినట్టు హీరో సుశాంత్ తెలిపారు. దర్శకుడు ఎంతో చక్కగా సినిమాను తీర్చిదిద్దారని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి నాగార్జున అభిమానిననీ, ఆయన ఆడియో ఫంక్షన్ కు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. మంచి టీమ్ లో పనిచేయడం సంతోషం కలిగించిందని స్నేహ ఉల్లాల్ పేర్కొంది. అంతా కష్టపడి పనిచేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు సూర్యప్రతాప్ అన్నారు.
Be first to comment on this News / Article!
|