పూర్తయిన 'యాగం'
'చందమామ' సక్సెస్ తర్వాత నవదీప్ పూర్తి వైవిధ్యం ఉన్న పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'యాగం'. భూమిక, కిమ్ శర్మ హీరోయిన్లుగా భరత్ ఠాగూర్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ పతాకంపై రాజు, ప్రవీణ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఆ వివరాలను తెలియజేస్తూ, ఇదొక థ్రిల్లర్ మూవీ అనీ, యాక్షన్ ప్రధానంగా ఉంటుందనీ చెప్పారు. సినిమాలోని ఎక్కువ భాగం బ్యాంకాక్ లో షూటింగ్ చేసినట్టు చెప్పారు. నవదీప్ తొలిసారి యాక్షన్ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. 'బ్యాంకాక్ లోని ఓ బార్ లో నవదీప్ వెయిటర్ గా పనిచేస్తుంటాడు. అదే బార్ లో కిమ్ శర్మ పనిచేస్తుటుంది. ఎయిర్ హోస్టెస్ గా భూమిక నటిస్తోంది. నవదీప్ ఓ యాగం చేయాలనుకుంటాడు. అయితే ఈ యాగం ఎందుకు చేయాలనుకున్నాడనేది తెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది' అని తెలిపారు. నవదీప్ ఇందులో పలు రిస్కీ ఫైట్స్ చేశారనీ, కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకునే సన్నివేశం డూప్ లేకుండా నటించారనీ చెప్పారు. నవదీప్ మాట్లాడుతూ, ఇందులో తన గెటప్ , లుక్ అన్నీ కొత్తగా ఉంటాయనీ, ఇప్పటివరకూ ఇలాంటి పాత్రను తాను చేయలేదనీ చెప్పారు. ఈ సినిమాతో తనకు యాక్షన్ హీరోగా కూడా మంచి బ్రేక్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మానందం, ఆలీ, రాహుల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|