బ్యాంకాక్ లో 'కొమురం పులి'
'జల్సా'తో గత ఏడాది స్వైరవిహారం చేసిన పవన్ కల్యాణ్ ఈ ఏడాది 'కొమురం పులి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొన్నటి వరకూ 'ప్రజారాజ్యం' పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో 'కొమురం పులి' షూటింగ్ వాయిదా పడింది. ఎన్నికల అనంతరం కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఇప్పుడు మళ్లీ ఆ చిత్రం షూటింగ్ కు సన్నద్ధమవుతున్నారు. ఇంతవరకూ సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం తాజాగా బ్యాంకాక్ లో 45 రోజల పాటు భారీ షూటింగ్ షెడ్యూల్ జరుపుకోనుంది. పవన్ తో 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగనమల రమేష్ నిర్మాత.
పవన్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడిగా లండన్ కు చెందిన నికిష పటేల్ తొలిసారి నటిస్తోంది. బ్యాంకాక్ లో జరిగే భారీ షెడ్యూల్ అనంతరం హైద్రాబాద్ లో ఓ చిన్న షెడ్యూల్ ఉంటుందనీ, అనంతరం పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇందులో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళా దర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు గణేష్ బాబు నిర్మించనున్న చిత్రానికి పవన్ కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|