'ఆ ఒక్కడు'కు క్లీన్ యు
పలు చిత్రాల్లో ప్రతినాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆ ఒక్కడు'. ఓవర్ సీస్ లో 'అందాల రాముడు', 'కృష్ణ', 'రెడీ', 'జల్సా' వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసిన 'టాలీ 2 హాలీ' సంస్థ సకుటుంబ సమేత చిత్రాలు నిర్మించాలనే కృతనిశ్చయంతో తొలిసారి 'ఆ ఒక్కడు' చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మించారు. సోమవారం నాడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
'ఆ ఒక్కడు' చిత్రంతో తెలుగు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతుండటం చాలా సంతోషంగా ఉందనీ, అందుకుతగ్గట్టే సకుటుంబ సమేత చిత్రంగా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫెకిట్ అందుకున్నామని వారు చెప్పారు. విలనీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ను తొలిసారి హీరోగా పరిచయం చేస్తున్నామనీ, ఇందులో ఆయన విభిన్న షేడ్స్ తో చక్కటి నటనా ప్రతభను కనబరచారనీ తెలిపారు. కొత్తమ్మాయి మధురిమ చక్కటి లుక్స్ తోనూ, నట ప్రతిభతోనూ ఆందర్నీ ఆకట్టుకుంటుందనీ, ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో బిజీ అవుతుందని అన్నారు. చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడైన ఎన్.ఎస్.మూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారనీ, స్క్రీన్ ప్లే ప్రధానంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారనీ వివరించారు. ఈ చిత్రంలో క్రిమినల్ లాయర్ గా మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రత్యేక పాత్ర ఆకట్టుకుంటుందని అన్నారు. ఈనెల 8న విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోందనీ, ముఖ్యంగా మణిశర్మ సంగీతం అందించిన 'అదోదోలే', 'మూతి మీద మీసం', 'రాధ మానస' పాటలు ఇన్ స్టెంట్ హిట్ గా నిలిచాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్ చందర్, నాజర్, సునీల్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. 'టాలీ 2 హాలీ' తదుపరి చిత్రంగా జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్ లో 'ప్రవరాఖ్యుడు' అనే చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. జగపతిబాబు-ప్రియమణి జంటగా తొలిసారి నటించిన 'పెళ్లైన కొత్తలో' చిత్రాన్ని అప్పట్లో టాలీ 2 హాలీ సంస్థ ఓవర్ సీస్ లో పంపిణీ చేయడం విశేషం.
Be first to comment on this News / Article!
|