ప్రిన్స్ మహేష్ బాబు 'అతిథి' చిత్రం తర్వాత వచ్చిన రెండేళ్ల గ్యాప్ ను భర్తీ చేస్తూ ఇక నుంచి ఏడాదికి రెండు చిత్రాల్లో నటించేందుకు నిశ్చయించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అతడు' వంటి హిట్ తర్వాత ఇప్పుడు మరోసారి 'వరుడు' చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారు. సింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. క్యాబ్ డ్రైవర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంలో అందాల నటి అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ జరిపేందుకు సమాయత్తమవుతోంది. తాజాగా మహేష్ మరో చిత్రం కూడా సెట్స్ పైకి తెచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది. 'పోకిరి' వంటి సంచలనాత్మక చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించిన మంజుల తన సోదరుడు మహేష్ తో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు.
మహేష్ కథానాయకుడుగా గౌతమ్ మీనన్ ('ఘర్షణ' ఫేమ్) దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం ఉంటుందని మంజుల తెలిపారు. స్టయిలిష్ మేకింగ్ లో ప్రతిభావంతుడైన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి చక్కటి స్క్రిప్టు రెడీ చేశారనీ, జూలై 20 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందనీ చెప్పారు. 'వరుడు' చిత్రానికి సమాంతరంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.