ఎన్ఆర్ఐ దర్శకుడు దేవ్ కట్టా 'వెన్నెల' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత మూడేళ్లకు మళ్లీ కెమెరా వెనక్కి వెళ్తున్నారు. తన తొలిచిత్రానికి అమెరికా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న దేవ్ కట్టా మలిచిత్రాన్ని మాత్రం ఇండియన్ సబర్బన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా రెడీ అయింది. వల్లభనేని రవి నిర్మించనున్న ఈ చిత్రానికి 'ప్రస్థానం' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
దేవ్ కట్టా 'వెన్నెల' చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించి ఇటీవల 'గమ్యం'తో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ ఈ కొత్త చిత్రంలో హీరోగా నటించనున్నారు. పార్వతి మిల్టన్ ను 'వెన్నెల'తో హీరోయిన్ గా పరిచయం చేసినట్టే ఈసారి కూడా ఓ ఎన్ఆర్ఐ అమ్మాయిని కథానాయికగా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సవితా సింగ్ అనే కెమెరామెన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మహేష్ శంకర్ ('వెన్నెల' ఫేమ్) సంగీతం అందించనున్నారు. ఈనెల 10న 'ప్రస్థానం' షూటింగ్ మొదలవుతుంది.