కొత్త హీరోయిన్లకు ఇప్పుడున్న అవకాశాలు మునపెన్నడూ లేవు. తొలి చిత్రంలో నటిస్తుండగానే మరో రెండు మూడు ఆఫర్లు చేతిలో వచ్చిపడుతున్నాయి. ప్రియా ఆనంద్ ఇప్పుడు అలాంటి లక్కీ ఛాన్సే సొంతం చేసుకుంది. రామ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. ఈ చిత్రానికి శ్రీవాస్ ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు.
రామ్ ప్రస్తుతం స్రవంతి మూవీస్ బ్యానర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు సినిమాకు ఆయన కమిట్ అయ్యారు. దీనికి 'రామ రామ కృష్ణ కృష్ణ' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఇందులో రామ్ తో పాటు మరో హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పటికే ఎంపికయ్యారు. తాజాగా హీరోయిన్ కోసం అన్వేషణ జరిపి చివరకు ప్రియా ఆనంద్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రియా ఆనంద్ ఇంకా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాణా (డి.సురేష్ బాబు తనయుడు) కథానాయకుడుగా రూపొందుతున్న 'లీడర్' చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.