రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్
వరుస సక్సెస్ లతో మడం తిప్పని దర్శకుడుగా పేరున్న ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు తన శక్తియుక్తులన్నీ 'మగధీర' చిత్రంపైనే కేంద్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ కు విభిన్నమైన ఇమేజ్ ను తెచ్చిపెట్టేలా పునర్జన్మల కథాంశంతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథా ఇతివృత్తాన్ని హ్యాండిల్ చేయడం రాజమౌళికి కూడా ఇదే మొదటిసారి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని జూలై 9న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం ఏ హీరోతో ఉండబోతోందనేది ఇంకా సస్పెన్స్ లో ఉన్నప్పటికీ ఈసారి తన గురువైన దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు కోసం ఓ చిత్రం చేసిపెట్టే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రం ద్వారా రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన విషయం సుపరిచితమే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి బిగ్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోయారు. 'సింహాద్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' వంటి వరుస హిట్లు అందించారు. ప్రభాస్ కెరీర్ లోనే 'ఛత్రపతి' బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో రాఘువేంద్రరావు నిర్మించ తలబెట్టిన చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించబోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఏక్ నిరంజన్'లో నటిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యారు. వీటి తర్వాతే రాజమౌళి కాంబినేషన్ చిత్రం కార్యరూపంలోకి రావచ్చు.
Be first to comment on this News / Article!
|