విప్లవనటుడి 'వీర తెలంగాణ'
ఆర్.నారాయణమూర్తి మరోసారి విప్లవ శంఖం పూరించబోతున్నారు. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా నమ్మిన సిద్ధాంతాలను తెరకెక్కించడంలో ఆయన తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తున్నారు. స్నేహచిత్ర బ్యానర్ పై 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. 'చీమలదండు', 'ఎర్రసైన్యం' వంటి పలు హిట్ చిత్రాలను ఆయన అందించారు. కళాశాలల్లో ర్యాగింగ్ పేరిట మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆయన ఇటీవల తీసిన 'కూతురు కోసం ' చిత్రం కారణాంతరాల వల్ల పబ్లిక్ కు సరిగ్గా రీచ్ కాలేదు. అయితే మంచి అభిరుచితో తీసిన చిత్రంగా నారాయణమూర్తికి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'వీర తెలంగాణ' అనే కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కథతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
తెలంగాణ వీరులుగా విలక్షణ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు, రియల్ స్టార్ శ్రీహరి నటించడానికి తమ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. సహజంగా తన చిత్రాలకు కొత్త నటీనటులను ఎంపిక చేసే నారాయణమూర్తి ఈసారి తెలంగాణ కథాంశానికి ఉన్న పవర్ ను దృష్టిలో పెట్టుకుని పాపులర్ స్టార్స్ ను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు చెబుతున్నారు. 'మేస్త్రి' చిత్రం తర్వాత మోహన్ బాబు, శ్రీహరి కాంబినేషన్ ఇందులో పునరావృతం అవుతుండటం విశేషంగానే చెప్పాలి. ఈ ఇద్దరూ దర్శకరత్న దాసరి శిష్యులయితే, దాసరి ఏకలవ్య శిష్యుడుగా చెప్పుకునేందుకు ఆర్.నారాయణమూర్తి ఎప్పుడూ వెనుకాడరు. 'వీర తెలంగాణ' చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ నెలాఖరులోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు నారాయణమూర్తి ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|